Sunday, May 10, 2009

ప్రహ్లాదుడా, నేనా?

ప్రహ్లాదుడు అనగానే మనకి చిన్న వయస్సులోనే విష్ణు భక్తిని మనస్సులో నింపుకున్న మహా భాగవతామూర్తి దర్సనము జరుగుతుంది. అంతేనా? ఈ సన్నివేశం నుంచి ఇంకేం లేదా నేర్చుకోవడానికి అని అనిపించింది. సరే మనం చదివిన చదువు నిజజీవితంలో పనికి ఎటూ పనికిరాలేదు. కనీసం పురాణఙ్ఞానం అన్నా పనికొస్తే అంతకన్నా కావల్సిందేముంది. కొంచెం ఆలోచిద్దాం అనిపించింది. అనిపించడమేమిటి, అనిపించడానికి మన చేతిలో ఏముందనీ, అది చెప్పడానికేనేమో రాత్రి పడుకోబోయే ముందు "హనుమానంజనాసూనః" అని ద్వాదశనామాలు చదివి నిద్రకుపక్రమించగానే వచ్చిన మొట్టమొదటి ఆలోచన ప్రహ్లాదుడిదే.

ప్రతి మనిషికి తన మనసులో విశ్వమంతా తానై, విశ్వమంతా తనలో వ్యాపించి ఉన్న ఆ పరమపురుషుడి గురించిన ఙ్ఞానం ఉంది. ఆ ఙ్ఞానమే ప్రహ్లాదుడు. అయితే మనమే దాన్ని శతధా, సహస్రధా, అన్నివిధాలా చంపివేయడానికి ప్రయత్నిస్తాం. ఆ మనమే హిరణ్యకశిపుడు.కానీ మనస్సులో ఉన్న ఆత్మ ఙ్ఞానం ఎప్పటికీ చావదు. సరైన సమయం వస్తే ఆఖండ జ్యోతిగా మారి మాయపొరని పటాపంచలు చేస్తుంది.ఆ ఆత్మజ్యోతిని అఖండజ్యోతిగా మార్చికొనే నిత్యానుష్టాన క్రియని చెప్పడమే ప్రహ్లాదుని జీవితం అని నా భావన. తను నమ్మిన హరి తనను ప్రలోభ పెట్టిన మాయ (హిరణ్యకశిపుని) నుండి తప్పించగలడు అని మనస్పూర్తిగా నమ్మడు కాబట్టే ప్రహ్లాదుడు అంత గుండె నిబ్బరంగా ఉండగలిగాడు. కానీ హిరణ్యకశిపుడు అలా వుండలేకపోయాడు ఎందుకని, భయం. సాటి రాక్షసుల మధ్య ఉండాల్సిన గౌరవం పోతుందని భయం. మనలో అందరికీ ఈ భయం ఉంది. అందుకే దారిన పోతూ ఉంటే ఏదైనా గుడి వస్తే వారి శక్తికొలది పక్కవాడికి కనపడకుండా ఏదో రకంగా "దండం పెట్టాను" అనిపించుకొని (అనుకొని) వెళ్ళిపోతాం. హిరణ్యకశిపునిది అలాంటి భయమే. ఆ భయమే పుత్రుడని కూడా చూడకుండా చంపమంది, మన భయం కూడా ఇలాంటిదే. అందుకే మనం కూడా మనలో ఉన్న ఙ్ఞానజ్యోతిని గుర్తించలేకపోతున్నాం. పక్కవాడు చూసి నవ్వుతాడని నువ్వు భయపడుతున్నావు. మరి నీ భయాన్ని చూసి ఆ భగవంతుడు నవ్వడా అని ఆలోచించగలిగిన నాడు హౄదయ పరివర్తనం జరుగి తీరుతుంది. ఒక్కసారి భయాన్ని, సంకోచాన్ని వదిలిపెట్టి ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తే ప్రహ్లాదుడి తర్వాత మీరూ, నేనే ఉంటాం, కాదంటారా?

3 comments:

  1. బాగా చెప్పారు. చక్కటి పరిశీలన.

    ReplyDelete
  2. అద్భుతంగా చెప్పారు

    ReplyDelete
  3. @ amma odi,pradeep:
    thanks for commenting

    ReplyDelete